కోవెంట్రీ తెలుగు అసోసియేషన్ తెలుగు కమ్యూనిటీని స్థాపించి పదేళ్లు పూర్తయిన సందర్భంగా దశాబ్ది ఉత్సవాలు నిర్వహించారు. యూకే లో జరిగిన దశాబ్ది ఉత్సవాలకు మిడ్‌ల్యాండ్స్, చుట్టుపక్కల నుంచి కుటుంబసమేతంగా 450 మంది సభ్యులు హాజరయ్యారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా నటుడు కెవ్వు కార్తీక్ తన హాస్యంతో ఆహూతులను కడుపుబ్బ నవ్వించారు. తెలుగువారందరినీ ఒకే చోట చేర్చాలనే మంచి ఉద్దేశంతో అసోసియేషన్ స్థాపించి విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. పదేళ్ల పండుగ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని, ప్రతి ఒక్క తెలుగు కుటుంబానికి అభినందనలు తెలిపారు. వేడుకకు విచ్చేసిన వారందరికీ నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు.


దాదాపు 8 గంటలపాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన ఉత్సవాలు, ఆటలు, పాటలు, నృత్యాలు, మహిళలకు మెహందీ, పిల్లలకు ఫేస్ పెయింటింగ్ లాంటి కార్యక్రమాలను నిర్వహించారు. ప్రముఖ నృత్య కళాకారిణి రాగసుధ తన నృత్యంతో అలరించారు. ఆమె ఇప్పటికే ఎన్నో అవార్డులు గెలుచుకుని తెలుగు సాంస్కృతిక రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె సేవలను సభ్యులు కొనియాడారు. రఫేల్ టికెట్స్, గిఫ్ట్ వోచర్స్, విజేతలకు గోల్డ్ కాయిన్స్, అల్పాహారం, విందు భోజనం, రిటర్న్ గిఫ్ట్స్ కార్యక్రమాలతో దశాద్ది ఉత్సవాలు ఘనంగా జరిగాయి.
