Skip to main content

Namaste NRI

శ్రీవారి చిత్రపటం రూపకర్త కన్నుమూత!

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల ఇళ్లలో నిత్యం పూజలందుకునే తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి చిత్రానికి ప్రాణం పోసిన ప్రముఖ చిత్రకారుడు ఎస్.ఎం. శ్రీనివాసన్ (86) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, గురువారం తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా కోవిల్పట్టిలోని తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. మనం ప్రతిరోజూ భక్తితో దండం పెట్టుకునే ఆ స్వామివారి చిత్రపటం వెనుక ఉన్న అసలైన కళాకారుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారన్న వార్త భక్తులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది.

తమిళనాడుకు చెందిన శ్రీనివాసన్ పదో తరగతి వరకే చదువుకున్నారు. కానీ చిత్రకళపై ఉన్న ఇష్టంతో ప్రముఖ చిత్రకారుడు కొండయ్య రాజు వద్ద శిష్యరికం చేసి కళలో మెళకువలు నేర్చుకున్నారు. ఆయన ప్రతిభను గుర్తించిన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ), 1970లో ప్రత్యేకంగా ఆహ్వానించింది. ఆ సమయంలో గర్భగుడిలోని మూలవిరాట్టును నేరుగా దర్శించుకునే అరుదైన అవకాశం ఆయనకు దక్కింది. ఆ దివ్య రూపాన్ని కళ్లారా చూసి, తన కుంచెతో అద్భుతంగా కాన్వాస్‌పై గీశారు.

అప్పట్లో ఆయన శ్రీవారిని రెండు రూపాల్లో చిత్రించారు. ఒకటి సర్వాభరణాలతో అలంకరించుకున్న రూపం కాగా, మరొకటి ఆభరణాలు లేకుండా నిరాడంబరంగా కనిపించే రూపం. ఈ రెండు చిత్రాలు అప్పట్లోనే భక్తుల్లో విపరీతమైన ఆదరణ పొందాయి. నేడు దాదాపు ప్రతి ఇంట్లో, వ్యాపార సంస్థల్లో కనిపించే ఆ అసలైన శ్రీవారి ఫొటో శ్రీనివాసన్ గీసిందే. వేంకటేశ్వరస్వామితో పాటు ఆయన ఇతర దేవతామూర్తుల చిత్రాలను కూడా ఎంతో జీవకళ ఉట్టిపడేలా గీసి మెప్పించారు.

శ్రీనివాసన్ మరణవార్త తెలియగానే స్థానికులు, పలువురు ప్రముఖులు తరలివచ్చి భౌతికకాయానికి నివాళులర్పించారు. తన కుంచెతో శ్రీవారి రూపానికి శాశ్వతత్వాన్ని అందించి, కోట్లాది మంది భక్తుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఆయన మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events