కార్మిక శక్తిని ఉత్తేజపరచడానికి సింగపూర్ తెలుగు సమాజం ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా ఘనంగా మే డే వేడుకలు నిర్వహించింది. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మిక సోదరులకు మూడు వారాల పాటు స్థానిక క్రాంజి రిక్రియేషన్ సెంటర్‌లో క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఎంతో ఆసక్తికరంగా సాగిన ఈ పోటీల్లో 11 జట్లు తలపడ్డాయి. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో పుల్లన్న గారి శ్రీనివాసరెడ్డి మద్దతు ఇచ్చిన తెలుగు స్టార్స్ టీమ్ వీరా ఫ్లేవర్స్ టీమ్ పై 19 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు రాపేటి జనార్థన్ మాట్లాడుతూ సిరీస్‌లో అత్యుత్తమ ప్రతిభ చూపిన బ్యాట్స్ మాన్ (ఖాసిమ్), బౌలర్ (కామేశ్వరరావు), ఆల్‌రౌండర్ (సుబ్బారెడ్డి) లకు అవార్డులు ప్రదానం చేశారని తెలిపారు. సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు బొమ్మారెడ్డి శ్రీనివాసులు రెడ్డి ప్లేయర్స్ కు చక్కటి సందేశం ఇస్తూ, కార్మిక సోదరులకు తెలుగు సమాజం చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. మేరువ కాశిరెడ్డి పర్యవేక్షణ లో సాగిన ఈ కార్యక్రమానికి వివిధ టీమ్‌ల మద్దతు దారులుగా వ్యవరించిన వారు ఇచ్చిన ఆర్ధిక సహకారంతో పాటు, మరికొందరు దాతలు సహకారం అందించారు.
ఫైనల్‌లో గెలిచిన వారికి జ్యోతిశ్వర్, బీవీవీ శ్రీనివాస్, యశ్వంత్ లు 1000 డాలర్లు, ద్వితీయ స్థానంలో నిలిచిన వారికి కేపీ వర్మ, గోపాల్ 500 డాలర్ల నగదు ప్రదానం చేశారు. ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగిన ఈ కార్యక్రమం లో తెలుగు సమాజం వైస్ ప్రెసిడెంట్ జ్యోతీశ్వర్, శ్రీనివాస రెడ్డి, మల్లిక్, నాగేశ్వర్, కోశాధికారి ప్రసాద్, కమిటీ సభ్యులు సమ్మయ్య, సుప్రియ, రామిరెడ్డి, రమణ, జితేందర్, గోపికిశోర్ ఇతర సభ్యులు పాల్గొన్నారు.