Namaste NRI

కోకాపేటలో కురిసిన కోట్లు …ఒక్క ఎకరం రూ.60 కోట్లు పైనే

రియల్‌ఎస్టేట్‌ మార్కెట్‌లో హైదరాబాద్‌ సత్తా ఏమిటో మరోసారి రుజువైంది. ఐటీ కారిడార్‌లోని కోకాపేటలో ప్రభుత్వ భూముల అమ్మకానికి ఆన్‌లైన్‌లో నిర్వహించిన వేలం కార్యక్రమానికి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల నుంచి విపరీతమైన డిమాండ్‌ వచ్చింది. ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అభివృద్ధి చేసిన కోకాపేట నియోపోలిస్‌ లేఅవుట్‌లో ప్లాట్లు హాట్‌కేలుగా అమ్ముడు పోయాయి. ఆన్‌లైన్‌ వేలంలో మొత్తం దాదాపు 50 ఎకరాల విస్తీర్ణం కలిగిన 8 ప్లాట్లను విక్రయానికి ఉంచారు. వీటిని కొనడానికి 80 మంది బిడ్లర్లు పోటీ పడ్డారు. ఎకరం కనీస ధర రూ.25 కోట్లు నిర్ణయించగా, బిడ్లర్లు పోటీ పడి మరీ స్థలాలను దక్కించుకున్నారు. ఇందులో ఎకరానికి కనిష్ఠంగా రూ.31.2 కోట్లు పలకగా, గరిష్ఠ ధర రూ.60.2 కోట్లు పలికింది.  మొత్తం వేలం ప్రక్రియలో సరాసరిగా ఎకరం రూ.40.45 కోట్లు పలికింది.

                2/పీ వెస్ట్‌ పార్ట్‌ గల ప్లాట్‌ను రాజపుష్ప ప్రాపర్టీస్‌ సంస్థ ఎకరానికి రూ.60.20 కోట్ల చొప్పున 1.65 ఎకరాలను రూ.99.33 కోట్లకు సొంతం చేసుకున్నది. మొత్తంగా కోకాపేట భూములు వేలం ద్వారా హెచ్‌ఎండీఏకు రూ.2000.37 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ వేలంతో హైదరాబాద్‌లో అత్యంత విలువైన భూమిగా కోకాపేటకు మరోసారి గుర్తింపు వచ్చింది. కోకాపేటలో ఇప్పటికే 58 అంతస్తుల వరకు వ్యాపార, వాణిజ్య,చ నివాస భవనాలు నిర్మాణంలో ఉన్నాయి.

                తాజాగా హెచ్‌ఎండీఏ అభివృద్ధి చేసిన నియోపోలిస్‌ లేఅవుట్‌లోనూ అదే స్థాయిలో హై రైజ్‌ అపార్ట్‌మెంట్లు నిర్మించడానికి అవకాశం ఉండటంతో బిడ్లర్లు పెద్ద ఎత్తున పోటీపడ్డారు. ఔటర్‌ రింగురోడ్డును అనుకొని ఉండటంతో పాటు పక్కనే గచ్చిబౌలి ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్‌ ఉండటం వల్ల ఈ భూములకు ప్రాధాన్యం పెరిగింది. నియోపోలిస్‌ లే అవుట్‌లోని 8 ప్లాట్లను ఒకే రోజు ఆన్‌లైన్‌ వేలం విక్రయించారు. ఉదయం 4 ప్లాట్లను, మధ్యాహ్నం మరో 4 ప్లాట్లను వేలం వేశారు. ఈ ప్రకియను కేంద్ర రంగ సంస్థ ఎంఎస్‌టీసీ నిర్వహించింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events