రోడ్డెక్కే ప్రతి వాహనదారుడికి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక గట్టి షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటివరకు కేవలం టోల్ వసూళ్లకే పరిమితమైన టోల్‌ప్లాజాలు, ఇకపై వాహనాల ఇన్సూరెన్స్ గడువును కూడా క్షణాల్లో పసిగట్టే అత్యాధునిక డిజిటల్ నిఘా కేంద్రాలుగా మారుతున్నాయి. ఏ వాహనానికైనా బీమా గడువు ముగిసినా లేకుంటే అసలు పాలసీ లేకపోయినా టోల్ గేట్ దాటగానే వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు హెచ్చరికలు రానున్నాయి. ప్రస్తుతం ఢిల్లీలోని అర్బన్ ఎక్స్టెన్షన్ రోడ్-2 పరిధిలోని ముండ్కా టోల్‌ప్లాజా వద్ద ఈ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతంగా ప్రారంభమైంది. త్వరలోనే ఈ విధానాన్ని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని టోల్‌ప్లాజాలకు విస్తరించేందుకు ఎన్హెచ్ఏఐ ప్రణాళికలు రచిస్తోంది.

ఈ పద్ధతి పూర్తి పారదర్శకంగా, ఆటోమేటెడ్ బ్యాకెండ్ సిస్టమ్ ద్వారా పనిచేస్తుంది. టోల్ గేట్ పైనుంచి వెళ్లే ప్రతి వాహనం నంబర్ ప్లేట్ వివరాలు నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ నిర్వహించే ‘వాహన్’ డేటాబేస్‌తో క్షణాల వ్యవధిలో అనుసంధానమవుతాయి. ఆ వాహనానికి చెల్లుబాటు అయ్యే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉందా లేదా అనేది సిస్టమ్ ఆటోమేటిక్‌గా తనిఖీ చేస్తుంది. ఒకవేళ పాలసీ గడువు ముగిసినట్లు తేలితే, ఆ వాహనం టోల్ దాటిన సమయం, ఇన్సూరెన్స్ ఎక్స్పైర్ అయిన తేదీతో సహా కొన్ని నిమిషాల్లోనే యజమానుల ఫోన్‌కు ఎస్ఎంఎస్ రూపంలో హెచ్చరిక వెళ్తుంది. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు చట్టపరంగా అందాల్సిన నష్టపరిహారంలో ఎటువంటి జాప్యం జరగకుండా చూడటమే ఈ కఠిన నిఘా ముఖ్య ఉద్దేశం.

మోటారు వాహనాల చట్టం ప్రకారం పబ్లిక్ రోడ్లపై తిరిగే ప్రతి వాహనానికి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉండటం చట్టరీత్యా తప్పనిసరి. ఈ నిబంధనను ఉల్లంఘించి ఇన్సూరెన్స్ లేకుండా పట్టుబడితే చట్టం భారీ మూల్యమే చెల్లించేలా చేస్తుంది. మొదటిసారి దొరికితే ప్రాథమిక ప్రీమియం మొత్తానికి మూడు రెట్లు లేదా రూ.5,000 (వీటిలో ఏది ఎక్కువైతే అది) జరిమానా విధిస్తారు. ఒకవేళ అదే తప్పును రెండోసారి చేస్తే, బేస్ ప్రీమియంకు ఐదు రెట్లు లేదా గరిష్ఠంగా రూ.10,000 వరకు భారీ పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి హైవేలపై ప్రయాణించే ముందు వాహనదారులు తమ డాక్యుమెంట్లు సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవడం అత్యంత శ్రేయస్కరం.















