అగ్రరాజ్యం అమెరికాలో తుఫాన్లు, టోర్నడోలు మరోసారి విధ్వంసం సృష్టించాయి. దక్షిణ, పశ్చిమమధ్య ప్రాంతాలను వణికించింది. అర్కన్సాస్, ఇల్లినాయిస్ తోపాటు ఇండియానా, అలబామా, టెన్నెస్సీల్లో తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. టోర్నడోల ధాటికి 21 మంది మరణించారు. డజన్ల కొద్ది మంది గాయపడ్డారు. గంటకు 100 కిలోమీటర్లకుపైగా వేగంతో పెనుగాలులు విరుచుకుపడటంతో ఇండ్లు, షాపింగ్ మాల్స్ కుప్పకూలాయి. మౌలిక సదుపాయాలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. గాలి తీవ్రతకు చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. దీంతో సుమారు 3 లక్షలకుపైగా ఇండ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పెనుగాలుల వల్ల అక్కడక్కడ అగ్నిప్రమాదాలు కూడా చోటుచేసుకున్నాయి. రవాణా వ్యవస్థ స్థంభించిపోయింది. షికాగో ఎయిర్పోర్టులు విమానాల రాకపోకలను నిలిపివేశారు. వచ్చే వారం మరికొన్ని భారీ తుఫాన్లు, టోర్నడోలు వచ్చేఅవకాశం ఉందని వాతావరణ విభాగం హెచ్చరించింది.