తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్‌సీసీ) నూతన అధ్యక్షుడిగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లో జరిగిన ఎన్నికల్లో దిల్‌రాజు, సి.కల్యాణ్ ప్యానెల్‌లు పోటీ పడ్డాయి. దిల్‌రాజు ప్యానెల్ కీలక పోస్ట్‌లను కైవసం చేసుకుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు పోలింగ్ జరిగింది. ప్రొడ్యూసర్ సెక్టార్, డిస్ట్రిబ్యూషన్ సెక్టార్, స్టూడియో సెక్టార్, ఎగ్జిక్యూటివ్ సెక్టార్‌ల నుంచి మొత్తం 1,339 మంది సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 14 రౌండ్లలో దిల్ రాజు ప్యానల్‌కు 563ఓట్లు, సి.కళ్యాణ్ ప్యానల్‌కు 497 ఓట్లు పోలయ్యాయి.
ఈ ఎన్నికల్లో 2023-25 సంవత్సరానికి గాను నూతన కార్యవర్గాన్ని సభ్యులు ఓటింగ్ ద్వారా ఎన్నుకున్నారు. టీఎఫ్‌సీసీ ఉపాధ్యక్షుడిగా ముత్యాల రామదాసు, కార్యదర్శిగా దామోదరప్రసాద్, కోశాధికారిగా ప్రసన్నకుమార్ ఎన్నికయ్యారు. భారీ మెజార్టీతో తనను గెలిపించిన సభ్యులకు దిల్‌రాజు కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. దిల్ రాజు ప్యానల్, సీ కల్యాణ్ ప్యానల్ మధ్య పోటీ హోరాహోరిగా సాగింది. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో మొత్తం 4 విభాగాలు.. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, స్టూడియో సెక్టార్లు.. ఫిలిం ఛాంబర్‌లో మొత్తం 1600 మంది సభ్యులు ఉన్నారు.