అమెరికాలోని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో దీపావళి వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. అధ్యక్షుడు జో బైడెన్ , కాంగ్రెస్ సభ్యుల నేతృత్వంలో వారం రోజులపాటు నిర్వహించనున్నారు. తన నివాసంలో జరిగే దీపావళి వేడుకలకు హాజరు కావాలని ప్రముఖ భారతీయ-అమెరికన్లు, దౌత్యవేత్తలను, ఉన్నతాధికారులను ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఆహ్వానించారు. ఈ నెల 24న దీపావళిని జరుపుకోవడానికి వైట్‌హౌ్‌సలోని భారతీయ-అమెరికన్లను అధ్యక్షుడు జో బైడెన్, ప్రథమ మహిళ జిల్ బైడెన్ ఆహ్వానించారు.
ఫ్లోరిడాలోని తన నివాసంలో రిపబ్లికన్ హిందూ కూటమికి చెందిన సుమారు 200 మంది ఇండియన్- అమెరికన్ల సమక్షంలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దీపావళి పండుగను జరుపుకోనున్నారు. ఈ వేడుకల్లో బాలీవుడ్ నృత్యాలతో పాటు అతిథులకు భారతీయ వంటకాలు వడ్డించనున్నారు. అలాగే దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల రాజధానులు, గవర్నర్ హౌస్‌ల్లో సైతం దీపావళి పార్టీలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ వేడుకలను తిలకించేందుకు పలువురు ప్రముఖ భారతీయ-అమెరికన్లు దేశం నలుమూలల నుంచి రాజధాని నగరానికి ప్రయాణమయ్యారు.