అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికలో ఓటమిని తట్టుకోలేకపోయిన ట్రంప్ ఎన్నికల బ్యాలెట్ బాక్సులను సీజ్ చేయాలని రక్షణశాఖ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. దానికి సంబంధించిన డ్రాఫ్ట్ ఆర్డర్‌ను నేషనల్ ఆర్క్యివస్ సీజ్ చేసింది. డిసెంబర్ 16, 2020 రోజున ఆ ఆదేశాలు జారీ అయినట్లు వెల్లడైంది. వోటింగ్ మెషీన్లను సీజ్ చేసేందుకు ప్రత్యేక కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాలని ఆ లేఖలో తెలిపారు. కానీ ఆ ఆదేశాల పత్రంపై మాత్రం ట్రంప్ సంతకం లేదని తేలింది.
అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్, బైడెన్ మధ్య జరిగిన పోరు యావత్ ప్రపంచాన్ని ఆకర్షించింది. ట్రంప్ ఓటమి తర్వాత క్యాపిటల్ హిల్‌పై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడి విచారణ జరుగుతున్న నేపథ్యంలో హౌజ్ కమిటీకి వచ్చిన 750 లేఖల్లో ఈ లేఖ కూడా ఉన్నట్లు తెలిసింది. ఎన్నికలకు సంబంధించిన మెషీన్లు, ఈక్విప్మెంట్, ఎలక్ట్రానిక్ డేటా, రికార్డులన్నింటినీ భద్రపరుచాలని ట్రంప్ తన మూడు పేజీల ముసాయిదాలో ఆదేశించారు.