
రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నారు. అమెరికాలోని కొన్ని సంస్థల్లో సమూల ప్రక్షాళన చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికా ఎన్నికల ప్రక్రియలో భారీ మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి ఓటరు నమోదు కోసం పౌరసత్వానికి సంబంధించిన ధ్రువపత్రాన్ని తప్పనిసరి చేశారు. ఈ మేరకు ఒక కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు.

ప్రపంచంలో ప్రజాస్వామ్య విధానానికి మార్గదర్శకంగా నిలుస్తున్న అమెరికా ఎన్నికల వ్యవస్థలో మాత్రం ప్రాథమిక నిబంధనల అమలులో వెనుకబడి ఉంది. ఆధునిక, అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎన్నికల ప్రక్రియలో ఉన్న ప్రాథమిక, అవసరమైన నిబంధనలను అమలు చేయడంలో యూఎస్ విఫలమైంది. ఉదాహరణకు భారత్, బ్రెజిల్ వంటి దేశాలు తమ ఓటరు గుర్తింపును బయోమెట్రిక్ డేటాబేస్‌తో అనుసంధానం చేస్తున్నాయి. అమెరికా మాత్రం పౌరసత్వాన్ని నిర్ధారించుకోవడం కోసం ఇప్పటికీ స్వీయ ధ్రువీకరణపై ఆధారపడుతోంది. మరోవైపు జర్మనీ, కెనడా ఓట్లను లెక్కించేటప్పుడు పేపర్ బ్యాలెట్ విధానాన్ని అనుసరిస్తున్నాయి. అయితే, యూఎస్ ఎన్నికల విధానంలో మాత్రం అనేక లోపాలు ఉన్నాయి అని ట్రంప్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
