అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీపడుతున్న యూఎస్ మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తొలి విజయాన్ని నమోదు చేసుకున్నారు. ప్రైమరీలో కీలకమైన అయోవా కాకసన్ ఎన్నికల్లో ట్రంప్ మెజారిటీ ఓట్లు సాధించారు. ఐరాస మాజీ రాయబారి నిక్కీ హేలీ, ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిశాంటిస్‌లను వెనక్కి నెట్టి ట్రంప్ ముందు వరుసలో దూసుకుపోయారు. దీంతో రెండో స్థానం కోసం రాన్ డిశాంటిస్, నిక్కీ హేలీ మధ్య పోటీ నెలకొంది.
అయితే, ఈ సారి ట్రంప్‌కు ఎన్నో అవాంతరాలు ఎదురయ్యాయి. ఇటీవలే ట్రంప్‌పై రెండు రాష్ట్రాలు వేటు కూడా వేశాయి. ప్రైమరీ ఎన్నికల్లో పోటీ చేయకుండా కొలరాడో, మైన్ రాష్ట్రాలు ఆయనను నిషేధించాయి. దీనిపై ఆయన అమెరికా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇక ట్రంప్ అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడుతుండటం వరుసగా ఇది మూడోసారి. 2016లో ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టిన విషయం తెలిసిందే. ఆ తర్వాత 2020లో డెమోక్రటిక్ నేత జో బైడెన్ చేతిలో ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు అధ్యక్ష పీఠం కోసం బరిలోకి దిగారు.