రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నారు. ట్రంప్ ఇప్పటికే వివిధ దేశాలపై సుంకాలను వడ్డిస్తూ వాణిజ్య యుద్ధానికి తెరతీసిన విషయం తెలిసిందే. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికా దిగుమతి చేసుకునే అన్ని విదేశీ కార్లపై 25 శాతం సుంకం విధించనున్నట్లు ప్రకటించారు. ఈ చర్య శాశ్వతమని అధ్యక్షుడు స్పష్టం చేశారు.

అమెరికాలో తయారు చేసిన వాహనాలపై ఎలాంటి సుంకం లేదని స్పష్టం చేశారు. ఈ నిర్ణయం ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపారు. వైట్‌హౌస్‌లో జరిగిన కార్యక్రమంలో అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ అమెరికాలో తయారు కాని అన్ని కార్లపై 25 శాతం సుంకం విధిస్తున్నాం. ఈ సుంకం శాశ్వతంగా ఉంటుంది. యూఎస్‌లో తయారయ్యే వాటిపై మాత్రం ఎలాంటి సుంకం ఉండదు. ఏప్రిల్ 2 నుంచి ఇవి అమల్లోకి వస్తాయి అని ట్రంప్ పేర్కొన్నారు. ఈ చర్యతో అమెరికాలో విదేశీ కార్ల ధరలకు రెక్కలు రానున్నాయి.
