అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి ఇండియాకు వార్నింగ్ ఇచ్చారు. రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్న ఆయన భారతీయ పన్ను వ్యవస్థను తప్పుపట్టారు. అమెరికా ఉత్పత్తులపై భారత్ అధిక స్థాయిలో దిగుమతి సుంకాన్ని వసూల్ చేస్తున్నట్లు ఆయన ఆరోపించారు. ఒకవేళ మళ్లీ తాను దేశాధ్యక్షుడిగా ఎన్నికైతే, అప్పుడు భారతీయ ఉత్పత్తులపైన దిగుమతి సుంకాన్ని పెంచనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఇండియాలో తయారైన బైక్‌లను అమెరికాలో ఎటువంటి పన్ను వసూల్ చేయకుండా అమ్ముతున్నారని, కానీ అమెరికాలో తయారైన బైక్‌లకు మాత్రం ఇండియా అత్యధిక స్థాయిలో సుంకాన్ని వసూల్ చేస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. భారతీయ పన్ను విధానాన్ని ప్రశ్నించినందుకు కొందరు సేనటర్లు తనను వ్యతిరేకించినట్లు కూడా ట్రంప్ వెల్లడించారు. ఇండియా 200 శాతం పన్ను వసూల్ చేస్తే, మనం వంద శాతం కూడా చేయలేమా అని ఆయన ప్రశ్నించారు.
పన్నులను వసూల్ చేయడంలో భారత్ టారిఫ్ కింగ్ అని గతంలో ఓ సారి ట్రంప్ కామెంట్ చేసిన విషయం తెలిసిందే. హర్లే డేవిడ్‌సన్ మోటార్‌సైకిళ్లపైన కూడా భారత్ భారీగా పన్ను వసూల్ చేస్తున్నట్లు ఆయన గతంలో ఆరోపించారు. 2018లో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యల వల్ల.. అప్పట్లో బైక్‌లపై కస్టమ్స్ డ్యూటీని 75 శాతం నుంచి 50 శాతానికి తగ్గించారు.