ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ మధ్యకాలంలో భారతీయ విద్యార్థులకు అమెరికా జారీచేసే వీసాల సంఖ్య భారీ స్థాయిలో తగ్గిపోయింది. 2024 సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో భారతీయ విద్యార్థులకు జారీ చేసిన ఎఫ్-1 స్టూడెంట్ వీసాలలో 38 శాతం తగ్గుదల ఉంది. గత ఏడాదితో పోలిస్తే ఇదే కాలంలో కొవిడ్ తర్వాత ఇంత భారీ స్థాయిలో వీసాల తగ్గుదల కనిపించడం ఇదే మొదటిసారి.
కొవిడ్ తర్వాత అమెరికాలోని అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలలో అంతర్జాతీయ విద్యార్థుల చేరికలో పెరుగుదల కనిపించింది. ఇతర దేశాల స్టూడెంట్ వీసాల జారీలో స్వల్పంగా తగ్గుదల ఉండగా భారతీయ విద్యార్థులకు జారీ చేసిన వీసాల సంఖ్యలో మాత్రం గణనీయమైన పెరుగుదల ఉంది. ఇప్పటికే కఠినంగా ఉన్న అమెరికా వీసా నిబంధనలు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో మరింత కఠినంగా మారే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.