అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి స్థానిక ఫెడరల్ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్, రష్యా సహా మొత్తం 75 దేశాల పౌరుల ఇమ్మిగ్రెంట్ వీసా ప్రాసెసింగ్‌ను నిలిపివేస్తూ ఈ ఏడాది జనవరిలో ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అమెరికా న్యాయస్థానం కొట్టివేసింది. ఈ విధానం ఫెడరల్ వలస చట్ట నిబంధనలకు విరుద్ధంగా ఉందని యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి జీనెట్ వర్గాస్ తీర్పు ఇచ్చారు. ఇమ్మిగ్రెంట్ వీసాల జారీ విషయంలో కాన్సులర్ అధికారుల నిర్ణయాధికారంపై విదేశాంగ కార్యదర్శికి ఉన్న అధికారాన్ని ఫెడరల్ చట్టం పరిమితం చేస్తోందని జడ్జి పేర్కొన్నారు. దరఖాస్తుదారుల జాతీయత ఆధారంగా వీసా జారీ ప్రక్రియను పూర్తిగా నిలిపివేసే అధికారం విదేశాంగ శాఖకు లేదని స్పష్టం చేశారు.

75 దేశాల పౌరుల జాతీయతను ఆధారంగా చేసుకుని ఇమ్మిగ్రెంట్ వీసా జారీ ప్రక్రియను నిలిపివేయడం చట్టబద్ధం కాదని జడ్జి జీనెట్ వర్గాస్ పేర్కొన్నారు. ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న విధానం చట్టవిరుద్ధమైనది అని ఆమె అభిప్రాయపడ్డారు. విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో తన చట్టబద్ధ అధికార పరిధిని మించి వ్యవహరించారని తీర్పులో పేర్కొన్నారు. ఇమ్మిగ్రెంట్ వీసాల విషయంలో దరఖాస్తుదారుల జాతీయత ఆధారంగా సమష్టిగా నిషేధం విధించడం ఫెడరల్ వలస చట్టంలోని నిబంధనలకు విరుద్ధమని కోర్టు స్పష్టం చేసింది.















