అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ పాలనలో దూకుడు పెంచారు. ముఖ్యంగా అక్రమ వలసదారుల పై ఉక్కుపాదం మోపుతున్నారు. అమెరికా వ్యాప్తంగా ఎక్కడికక్కడ అక్రమ వలసదారులను అరెస్ట్ చేయిస్తున్నారు. తాజాగా దేశంలోకి అక్రమంగా ప్రవేశించడంతోపాటు దొంగతనాలు, ఇతర నేరాలకు పాల్పడిన సుమారు 500 మందికిపైగా వలసదారులను అక్కడి అధికారులు అరెస్ట్ చేశారు. వందలమందిని దేశం నుంచి పంపించేశారు.
వలసదారుల అరెస్ట్‌పై శ్వేతసౌధం మీడియా కార్యదర్శి కరోలిన్ లీవిట్ స్పందించారు. అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలతో అధికారులు ఇప్పటి వరకూ 538 మంది అక్రమ వలసదారులను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. అరెస్టైన వారంతా ఉగ్రవాదం, మాదకద్రవ్యాల రవాణా, లైంగిన నేరాలు వంటి కేసుల్లో నిందితులుగా ఉన్నవారేనని తెలిపారు. అంతేకాకుండా సైనిక విమానాల్ని ఉపయోగించి వందలాదిమందిని బహిష్కరించినట్లు తెలిపారు. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్ విజయవంతంగా కొనసాగుతోంద ని వెల్లడించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని అధ్యక్షుడు ట్రంప్ నెరవేరుస్తున్నట్లు కరోలిన్ వివరించారు.
కాగా, అక్రమ వలసలదారుల బహిష్కరణకు సంబంధించి తీసుకొచ్చిన కీలక బిల్లుకు యూఎస్ కాంగ్రెస్ ఇటీవలే ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దొంగతనాలు, తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారిని అదుపులోకి తీసుకునేలా ఈ బిల్లును రూపొందించారు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత కాంగ్రెస్ ఆమోదించిన అత్యంత ముఖ్యమైన ఇమ్మిగ్రేషన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బిల్లు ఇదే అని అక్కడి అధికారులు పేర్కొంటున్నారు.