అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు మరో 43 రోజుల సమయం ఉంది. దీంతో ప్రధాన అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ తమ ప్రచార జోరు పెంచారు. ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటు న్నారు. ఈ నేపథ్యంలో రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ పడుతున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. నవంబర్ 5న జరిగే ఎన్నికల్లో తాను గెలవకపోతే మరోసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించారు. నవంబర్ 5న జరిగే అధ్యక్ష ఎన్నికల్లో మేం ఓడిపోతామని అస్సలు అనుకోవడం లేదు. ఆ ఆలోచనే లేదు. మేం తప్పకుండా విజయం సాధిస్తామన్న నమ్మకం ఉంది. ఒకవేళ ఓడిపోతే 2028 ఎన్నికల్లో నేను బరిలోకి దిగను. ఈ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను అని ట్రంప్ స్పష్టం చేశారు.