
అమెరికాలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కంటే అక్రమ వలసదారులతోనే ముప్పు ఎక్కువగా ఉన్నదని పేర్కొన్నారు. పుతిన్ గురించి తాను ఆందోళన చెందడం లేదని, అమెరికాకు యూరప్ గతి పట్టకుండా చూసేందుకు అక్రమ వలసలను నిరోధించడంపైనే దృష్టి కేంద్రీకరించానని తెలిపారు. పుతిన్ గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదని, అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న రేప్ గ్యాంగ్‌లు, డ్రగ్ లార్డులు, హంతకులు, మెంటల్ సంస్థల వ్యక్తులపైనే మనం దృష్టి సారించాలని, అప్పుడే మనకు యూరప్ లాంటి పరిస్థితి ఏర్పడదని స్పష్టం చేశారు.

గత నెల రోజుల్లో తాను చేపట్టిన చర్యల వల్ల అమెరికా-మెక్సికో సరిహద్దుల్లో అక్రమ వలసలు చారిత్రక కనిష్ఠ స్థాయికి తగ్గాయని ట్రంప్ వెల్లడించారు. ఫిబ్రవరిలో అమెరికా సరిహద్దు వద్ద కేవలం 8,326 మంది అక్రమ వలసదారులు మాత్రమే పట్టుబడ్డారని, వారందరినీ వెంటనే వెనక్కి పంపేశామని వివరించారు. జో బైడెన్ అధికారంలో ఉన్నప్పుడు అమెరికాలోకి ప్రతి నెలా దాదాపు 3 లక్షల మంది అక్రమంగా ప్రవేశించేవారని విమర్శించారు.
