అక్రమ వలసలను అరికట్టేందుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కొత్త వ్యూహాలు పన్నుతున్నది. భారతీయులతో సహా అంతర్జాతీయ విద్యార్థుల లక్ష్యంగా విస్తృత చర్యలు చేపడుతున్నది. ఇందులో భాగంగా వారిని అమెరికా నుంచి త్వరగా పంపేందుకు కొత్త విధానాన్ని తీసుకువచ్చింది. ఒక విద్యార్థి వీసా రద్దు అయినప్పటికీ అమెరికాలో చదువు పూర్తి చేసేందుకు, వారు అక్కడ ఉండేందుకు ఇప్పటి వరకు అనుమతిస్తున్నారు. అయితే అమెరికాను వీడితే తిరిగి ప్రవేశించలేరు.

కాగా, విద్యార్థి వీసా రద్దైన వెంటనే అమెరికా నుంచి వెంటనే బహిష్కరించే కొత్త విధానాన్ని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ రూపొందించింది. తక్కువ వ్యవధిలో వీసాలు రద్దైన కొంత మంది విద్యార్థులు అమెరికాలోని కోర్టులను ఆశ్రయించారు. ఈ కేసుల విచారణ సందర్భంగా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కొత్త విధానం వెలుగులోకి వచ్చింది. ఏదైనా కారణం చేత ఒక విద్యార్థి వీసాను రద్దు చేస్తే అమెరికాలో చదువు అవకాశాన్ని లేదా ఉద్యోగాన్ని కొనసాగించే హక్కును కోల్పోతారు.

మరోవైపు విద్యార్థులు ఏ తప్పు చేయనప్పటికీ వారిని నేరస్తులుగా పరిగణిస్తారు. క్రిమినల్ డాటాలో వారి పేర్లు ఉంచుతారు. ఆ విధంగా విద్యార్థుల చట్టపరమైన హోదాను రద్దు చేసి దేశం నుంచి బహిష్కరిస్తారు. ఈ కొత్త విధానానికి సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేస్తామని ట్రంప్ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారాన్ని ఆ మేరకు విస్తరిస్తామని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ పేర్కొన్నట్లు బాధిత విద్యార్థుల తరుఫు న్యాయవాది వివరించారు.