ఈ ప్రపంచానికి అతిపెద్ద ముప్పు అణ్వస్త్రాలని అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అందరూ భూతాపం, పర్యావరణం గురించి మాట్లాడుతుంటారని, తాను మాత్రం ప్రపంచ దేశాల దగ్గర ఉన్న అణ్వాయుధాలే పెను విపత్తుగా భావిస్తానని చెప్పారు. ఆఖరికి పాకిస్థాన్ కూడా అణ్వాయుధాలను అందిపుచ్చుకున్నదని ఆ దేశాని చులకన చేస్తూ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మిషిగావ్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ట్రంప్ తాను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మానవాళికి పెను విపత్తును తెచ్చిపెట్టే అణ్వస్త్రాలపై తానే స్వయంగా నిఘా ఉంచే వాడినని, ప్రస్తుతం పరిస్థితి మారిపోయిందని అన్నారు. ఇప్పుడు పాకిస్థాన్ కూడా తన అణ్వాయుధాలను పెంచుకునే పరిస్థితికి వచ్చిందని వ్యాఖ్యానించారు. ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో ప్రపంచ దేశాలు పాకిస్థాన్ దగ్గర ఎన్ని అణ్వాయుధాలు ఉన్నాయనే అంశాన్ని పరిశీలిస్తున్నారు.