
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏం చేసినా సంచలనమే. ఆయన తీసుకునే నిర్ణయాలు ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. ఎప్పటిలాగే ట్రంప్ తాజాగా ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఓ 13 ఏళ్ల బాలుడిని అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ గా నియమించారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి కాంగ్రెస్ సంయుక్త సెషన్‌లో ట్రంప్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన కీలక ప్రకటన చేశారు.

యూఎస్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్‌గా క్యాన్సర్‌తో పోరాడి మహమ్మారిని జయించిన 13 ఏళ్ల బాలుడు డీజే డేనియల్ ని నియమిస్తున్నట్లు ప్రకటించారు. ట్రంప్ ప్రకటనతో సీక్రెట్ సర్వీస్ డైరెక్టర్ కరన్, గ్యాలరీలో కూర్చొని ఉన్న బాలుడి దగ్గరకు వెళ్లి అధికారిక ఐడీ కార్డును అతడికి అందజేశారు. ఆ సమయంలో సభలో డెమోక్రాట్లతో పాటు రిపబ్లికన్లు కూడా ఉండగా, అంతా కలిసి చప్పట్లు కొట్టారు. అరుదైన గౌరవం దక్కించుకున్న ఆ బాలుడికి అభినందనలు తెలిపారు.
