ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. దీంతో యావత్ ప్రపంచం అక్కడి పరిస్థితులపై ఉత్కంఠతో గమనిస్తోంది. తూర్పు ఉక్రెయన్‌లోని కాడివ్కా ప్రాంతం కాల్పులతో దద్దరిల్లింది. రష్యా మద్దతు ఇస్తున్న ఏర్పాటువాదులు, ఉక్రెయిన్ సైనికుల మధ్య ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనపై అటు వేర్పాటువాదులు, ఇటు ఉక్రెయిన్ సైన్యం పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. గ్రనేడ్లు, భారీ ఆయుధాలతో వేర్పాటువాదులే తొలుత కాల్పులకు తెగబడ్డారని ఉక్రెయిన్ సైన్యం ఆరోపిస్తుంటే, సైన్యమే తమపై తొలుత కాల్పుకు దిగిందని వేర్పాటువాదులు ఆరోపిస్తున్నారు. గడిచిన 24 గంటల్లో నాలుగు సార్లు సైన్యం తమపై కాల్పులు జరిపిందని పేర్కొన్నారు. కాగా, ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టమూ లేకున్నా, ఇద్దరు పౌరులు గాయపడినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్‌ను ఆక్రమించబోతోందంటూ వచ్చిన ఆరోపణలను రష్యా కొట్టిపడేసింది. సరిహద్దులో మోహరించిన సైన్యాన్ని వెనక్కి పిలిపిస్తున్నట్టు, ఇప్పటికే లక్షలాది మంది సిబ్బందిని వెనక్కి పిలిపించినట్టు వెల్లడిరచింది.
