లోకాసమస్త సుఖినో భవంతు అన్న మహా సత్సంకల్పంతో మన ఋషులు వేద ప్రమాణంగా నిర్దేశించిన దిశను, సాంప్రదాయ, అనుష్ఠానాలని కొనసాగించాలన్న ముఖ్య ఉద్దేశంతో సింగపూర్‌లో నివసించే కొంతమంది తెలుగు బ్రాహ్మణులు ఒక సమూహంగా ఏర్పడి, ధర్మ నిరతి, ధర్మ అనుష్టానం కోసం 2014 నుంచి అనేక కార్యక్రమాలు (నిత్యసంధ్యావందనం, లక్ష గాయత్రి హోమం, సామూహిక సత్యనారాయణస్వామి వ్రతం, మాస శివరాత్రి సందర్భంగా రుద్రాభిషేకం) నిర్వహిస్తూ విజయవంతంగా కొనసాగిస్తున్నారు.


ఈ క్రమంలో సెప్టెంబర్ 16 న (భాద్రపద శుద్ధ పాడ్యమి నాడు) జరిగిన ఏకాదశ రుద్రాభిషేకం కార్యక్రమానికి విశేషమైన స్పందన లభించింది. దాదాపు 40 మందికి పైగా రుత్వికులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో సింగపూర్‌లో నివసిస్తున్న తెలుగు బ్రాహ్మణలు పెద్దఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

కార్యక్రమానికి వచ్చిన మహిళలు లలితా పారాయణం, సౌందర్య లహరి, లింగాష్టక పఠనం, హారతి గానంతో అందరిని మంత్రముగ్ధులను చేసారు. కార్యక్రమానికి విచ్చేసిన మహిళలు అందరు చక్కని సమన్వయంతో తీర్ధప్రసాదాలు, చక్కటి తెలుగు సాంప్రదాయ ప్రసాద విందుని ఏర్పాటు చేసారు.