అగ్రరాజ్యం అమెరికాను బాంబ్ సైక్లోన్ నుంచి కోలుకోకముందే వరదలు ముంచెత్తాయి. కాలిఫోర్నియా, లాస్ ఏంజిల్స్‌లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కాలిఫోర్నియాలోని దాదాపు 90 శాతం మంది ప్రజలు వరద గుప్పిట్లో చిక్కుకున్నారు. హాలీవుడ్ ప్రముఖులు నివాసం ఉండే లాస్ ఏంజిల్స్ సమీపంలోని మాంటెసిటో నగరంలో పరిస్థితి దారుణంగా ఉందని అధికారులు తెలిపారు. బురద ముప్పు పొంచి ఉందని, ప్రజలు ఈ నగరాన్ని వెంటనే వీడాలని ఎమర్జెన్సీ అలర్ట్ జారీ చేశారు. వచ్చే 24గంటల్లో ఈ ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. కాగా, కాలిఫోర్నియాలోని 17 రీజియన్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో పలు జిల్లాల్లోని స్కూళ్లు, ఆఫీసులకు సెలవులు ప్రకటించారు.
భారీ వర్షాల కారణంగా ముంచెత్తిన వరదలతో పలు చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. మరికొన్ని చోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి. వర్షాల నేపథ్యంలో కాలిఫోర్నియా రాష్ట్రంలో సుమారు 25 వేల మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. శాక్రమెంటో ఏరియాలో భారీ వృక్షాలు కూలి విద్యుత్ తీగలపైన పడడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సెంట్రల్ కాలిఫోర్నియాలో మహిళ సహా ఐదేళ్ల బాలుడు వరద నీటిలో గల్లంతయ్యాడు. రెస్క్యూ సిబ్బంది దాదాపు ఏడు గంటల పాటు గాలించినా ఫలితం లేకుండా పోయింది.