సాంకేతిక సమస్యల కారణంగా పలుమార్లు వాయిదా పడిన తర్వాత ఎట్టకేలకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం లోకి అడుగుపెట్టారు భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్. ఆమెతోపాటు మరో వ్యోమగామి బుచ్ విల్‌మోర్‌లు ప్రయాణించిన బోయింగ్ స్టార్‌లైనర్ వ్యోమనౌక జూన్ 5న ఐఎస్‌ఎస్ కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వారి తిరుగు ప్రయాణానికి సమస్యలు తలెత్తాయి. దీంతో ల్యాండింగ్ వాయిదా పడింది. 10 రోజుల మిషన్‌లో భాగంగా సునీత , విల్‌మోర్ ఈ రోదసీ యాత్ర చేపట్టారు. జూన్ 14న వీరిద్దరూ భూమికి తిరుగు పయనం కావలసి ఉండగా, స్టార్‌లైనర్ వ్యోమనౌకలో హీలియం లీకేజీ కారణంగా సాంకేతిక సమస్యలు ఎదుర య్యాయి. దీంతో భూమిపై ల్యాండింగ్‌ను వాయిదా వేశారు. ఆ తర్వాత జూన్ 26 న వీరు తిరుగు ప్రయాణం కానున్నట్టు నాసా ప్రకటించగా, ఇప్పుడు మరోసారి వాయిదా పడింది. కొత్త తేదీని ఇంకా వెల్లడించ లేదు. అన్నీ అనుకూలిస్తే జులై 2న వీరి రిటర్న్ జర్నీ ఉండొచ్చని నాసా అంచనా వేస్తోంది.