తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌ను ఖండిస్తూ ఆస్ట్రేలియా లోని సిడ్నీ నగరంలో తెలుగుదేశం ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో ప్రవాసాంధ్రులు మౌన ప్రదర్శనలు, నిరాహార దీక్షలు చేపట్టారు. నగరంలోని ప్రసిద్ధ ఓపెరా హౌస్, పర్రమట్టాలోని గాంధీ విగ్రహం వద్ద తెలుగువారు భారీగా చేరుకుని చంద్రబాబుకి సంఘీభావంగా జస్టిస్ ఫర్ బాబు, ఐ యామ్ విత్ సిబియన్ ప్లకార్డులతో మౌనప్రదర్శన నిర్వహించారు. అంతేకాకుండా బౌల్ఖం హిల్స్‌లో తెలుగుదేశం ఆస్ట్రేలియా సభ్యులు నిరాహారదీక్షలు చేపట్టారు. పార్టీలకీ, ప్రాంతాలకీ అతీతంగా చంద్రబాబు అభిమానులు కుటుంబసభ్యులతో సహా వచ్చి నిరాహారదీక్షలో పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల అభివృద్దే ధ్యేయంగా 45 ఏళ్లపాటు మచ్చలేని ప్రజాజీవితాన్ని గడిపిన చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించి అర్థరాత్రి అరెస్టులు చేయటాన్ని అందరూ ముక్తకంఠంతో ఖండించారు.
తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి రాబోయే ఎన్నికల్లో తన ఓటమి తప్పదని గ్రహించి జగన్మోహన్ రెడ్డి తన అధికారాన్ని అడ్డంపెట్టుకుని కక్షసాధింపు చర్యలకి పాల్పడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలకోట్ల అవినీతి కేసుల్లో ఏ1 నిందితునిగా ఉన్న జగన్ తన చుట్టూ ఉన్న అందరికి అవినీతి మరకలు అంటించాలని చూస్తున్నాడని దుయ్యబట్టారు.వెంటనే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు.
స్థానిక తెలుగు ప్రముఖులు నిమ్మరసం అందించి నిరాహారదీక్షలను విరమింపజేశారు. తెలుగుదేశం ఆస్ట్రేలియా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ అక్రమ కేసులు అరెస్టులతో తమ నాయకుడిని, పార్టీ కార్యకర్తలని భయపెట్టలేరని అన్నారు. దీనికి తగిన సమాధానం రాబోయే ఎన్నికల్లో ఓటు ద్వారా చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. చంద్రబాబుకి త్వరలోనే న్యాయం జరిగి కడిగిన ముత్యంలా బయటకు వస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. కార్యక్రమానికి వచ్చి బాబుకి సంఘీభావం తెలియచేసిన వారందరికి కృతజ్ఞతలు తెలిపారు.