అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించడానికి వెళ్లే భారత విద్యార్థుల సంఖ్య భారీగా పడిపోయింది. యూఎస్ కామర్స్ డిపార్ట్‌మెంట్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అడ్మినిస్ట్రేషన్(ఐటీఏ) గణాంకాల ప్రకారం గత ఏడాది ఆగస్టుతో పోలిస్తే ఈ ఏడాది ఆగస్టులో ఎఫ్, ఎం క్యాటగిరీ వీసాలపై అమెరికాకు చేరుకున్న భారతీయ విద్యార్థుల సంఖ్య 39 శాతం మేరకు తగ్గిపోయింది.

అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇమ్మిగ్రేషన్ నిబంధనలు మరింత కఠినతరం కావడంతో ఈ క్షీణత వేగవంతమైంది. ట్రంప్ పరిపాలనా కాలంలో విద్యార్థి వీసా దరఖాస్తుదారులకు సోషల్ మీడియా స్క్రీనింగ్‌ను తప్పనిసరి చేయడం, పోస్ట్ స్టడీ వర్క్‌పై భారీ ఫీజులను ప్రతిపాదించడం వంటి చర్యలు తీసుకున్నారు. విద్య, ఉద్యోగ వీసాలపై ఇలాంటి నిలకడలేని విధానాలు కొనసాగుతుండటంతో, అమెరికాపై నమ్మకం సడలిందని కన్సల్టెంట్లు చెబుతున్నారు.















