రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలంగాణ భవన్‌లో ప్రకటించారు. మొత్తం 119 నియోజకవర్గాలకుగాను 115 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. టికెట్లు వచ్చినవారందరికీ అభినందనలు తెలిపారు. నర్సాపూర్, జనగామ, నాంపల్లి, గోషామహల్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించలేదు. ప్రస్తుతం ప్రకటించినవాటిలో ఏడు చోట్ల వివిధ కారణాలతో సిట్టింగ్ అభ్యర్థులను మార్చారు. కొత్తవారికి అవకాశం కల్పించారు. వేములవాడ, బోథ్, ఖానాపూర్, ఆసిఫాబాద్, వైరా, కోరుట్ల, ఉప్పల్ స్థానాల్లో కొత్తవారిని బరిలోకి దింపుతున్నారు.ఇక బిఆర్ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ రాబోయే ఎన్నికలలో రెండు స్థానాలలో పోటీ చేయనున్నారు.. సిట్టింగ్ గజ్వేల్ తో పాటు నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డి లో పోటీ చేయనున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ బీఆర్‌ఎస్ పార్టీ మహాసముద్రంలాంటిదని, పార్టీలో ఎందరో సమర్థులైన నాయకులున్నారని తెలిపారు. టికెట్లు రానివాళ్లు నిరాశచెందాల్సిన అవసరం లేదని తెలిపారు.



