జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ పోలింగ్ నేడు జరగనుంది. రాష్ట్రంలోని మొత్తం 81 అసెంబ్లీ నియోజ కవర్గాల్లో 43 స్థానాలకు తొలి విడతలో ఓటింగ్ జరుగుతుంది. మొదటి దశలో 1.37 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 683 మంది అభ్యర్థులు బరిలో ఉండగా వీరిలో 609 మంది పురుషులు, 73 మంది మహిళలు, ఒకరు ట్రాన్స్‌జెండర్ ఉన్నారు. ఉదయం 7 గంటల నుంచి కొన్ని స్థానాలకు సాయంత్రం నాలుగు గంటల వరకు, మరికొన్నింట ఐదు గంటల వరకు పోలింగ్ జరగనుంది. మొదటి విడత పోలింగ్ జరిగే స్థానాల్లో ఇప్పటికే ప్రచారపర్వం ముగిసింది. తొలి దశ పోలింగ్ జరగనున్న అన్ని స్థానాల్లో ఎన్డీయే, ఇండియా కూటమి మధ్య హోరాహోరీ పోరు నెలకొన్నది.