మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం విశ్వంభర. వశిష్ట దర్శకత్వం. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్నది. త్రిష, అశికా రంగనాథ్ కథానాయికలు. జూన్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మ్యూజికల్ ప్రమోషన్స్‌కు శ్రీకారం చుట్టారు. రామ రామ అనే తొలి గీతాన్ని ఈ నెల 12న విడుదల చేయబోతున్నారు.

ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో చిరంజీవి చుట్టూ హనుమంతుడి వేషధారణలో ఉన్న చిన్నారులు, వారి బ్యాక్‌డ్రాప్‌లో రాముడి విగ్రహం కనిపిస్తున్నది. భక్తిరసప్రధానంగా సాగే ఈ గీతానికి ఎం.ఎం.కీరవాణి స్వరాల్ని అందించగా రామజోగయ్యశాస్త్రి రచించారు. అత్యాధునిక గ్రాఫిక్స్ హంగులతో చిరంజీవి కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎం.కీరవాణి, ప్రొడక్షన్ డిజైనర్: ఏ.ఎస్.ప్రకాష్, నిర్మాతలు: విక్రమ్, వంశీ, ప్రమోద్, రచన-దర్శకత్వం: వశిష్ట.
