భారతీయ ప్రముఖ, దివంగత చిత్రకారిణి అమృతా షేర్ గిల్ 1938లో గీసిన ఓ చిత్రం వేలంలో రికార్డు ధర పలికింది. రూ.37.8 కోట్లకు ఇది అమ్ముడుపోయింది. భారతీయ కళాకారుల చిత్రాలకు సంబంధించి ప్రపంచ వేలంలో దక్కిన రెండో అత్యధిక ధర ఇది కావడం గమనార్హం. అమృత చిత్రాల్లో ఇప్పటి వరకూ అత్యధిక ధర పలికింది కూడా ఇదే. వీఎస్ గయ్‌టొండె అనే మరో కళాకారుడు గీసిన చిత్రం ఈ ఏడాది రూ.39.98 కోట్లకు అమ్ముడు పోయింది. ఈ రెండు వేలాలను శాఫ్రాన్‌ఆర్ట్ సంస్థ నిర్వహించింది. అమృత విదేశాల నుంచి తిరిగొచ్చిన కొన్నేళ్లకు గోరఖ్‌పుర్‌లోని తన కుటుంబ ఎస్టేట్‌లో ఆ పెయింటింగ్‌ను గీశారు. ఇన్ ది లేడీస్ ఎన్‌క్లోజర్ పేరుతో చిత్రించిన ఆ కళాఖండంలో కొందరు మహిళలు దైనందిన పనుల్లో నిమగ్నమై కనిపిస్తున్నారు. దీంతో పాటు తాజా వేలంలో ఎఫ్‌ఎన్ సౌజా 1956లో గీసిన చిత్రం రూ.5.04 కోట్లకు, ఎన్‌ఎస్ బెంద్రే 1985లో సృజించిన చిత్రం రూ.1.67 కోట్లకు అమ్ముడుపోయాయి.