ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన ట్రేటింగ్ ప్లాట్‌ఫాంలు, డిజిటల్ అసెట్ ఇన్వెస్ట్మెంట్ సంస్థలు సౌత్ ఏషియన్ ఎంగేజ్మెంట్ ఫోరం తో కలిసి న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్లో ఆల్ అమెరికన్ దీపావళి వేడుకలు నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నాయి. తొలిసారిగా 2 నుంచి 4వ తేదీ వరకు దీపావళి సంబరాలు నిర్వహించబడుతున్నాయి. డబ్ల్యూటీసీ పోడియంపై డిజిటల్ మ్యూరల్, హడ్సన్ నదిపై బాణాసంచా కాల్చడం జరుగుతుంది. క్రాస్ టవర్ కూడా ఆల్ అమెరికన్ దీపావళి వేడుకల్లో భాగస్వామి అవుతోందని కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ కపిల్ రాఠి తెలిపారు.
ప్రారంభోత్సవ వేడుకల్లో న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్, భారత్ కాన్సుల్ జనరల్ రణధీర్ జైస్వాల్, జెర్సీ సిటీ మేయర్ స్టీవెన్ పూలోప్ హాజరవుతున్నారన్నారు. అమెరికాలో 2.7 మిలియన్ల మంది భారతీయులు ఉన్నారని, అమెరికా సంప్రదాయాన్ని భారతీయ సంస్కృతి మిళితం చేసేలా ఉంటుందన్నారు. దీపావళి రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలైన అమెరికా, భారత్‌ను ఒకేచోట చేర్చనుందని తెలిపారు. భారతీయత ఉట్టిపడేలా దీపాలు, అమెరికన్ క్రాకర్స్‌తో ఈ పండుగ జరుపుకోనున్నట్టు వివరించారు.