విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలని, టీచర్ ఖాళీల భర్తీని చేపట్టాలని, బడుల్లో మెరుగైన వసతులను కల్పించాలని డిమాండ్ చేస్తూ ఫ్రాన్స్‌లో రెండు వారాలుగా కొనసాగుతున్న విద్యార్థుల నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. తరగతులను బహిష్కరించిన విద్యార్థులు రోడ్లమీదకు వచ్చి ఆందోళనలు చేపట్టారు. దీంతో 500 వరకూ స్కూల్స్ మూతబడ్డాయి. తమ నిరసనలను అడ్డుకొంటున్న పోలీసులపై మండిపడ్డ విద్యార్థులు, చెత్త బుట్టలను కాల్చి విసిరేశారు.

దీంతో ఆందోళనకారులను కట్టడి చేయడానికి పోలీసులు భాష్పవాయు గోళాలను ప్రయోగించారు. బడి విద్యార్థుల నిరసనల్లో టీచర్లు, ఉద్యోగులు, విశ్వవిద్యాలయ విద్యార్థులు కూడా చేరుతుండటంతో నిరసనోద్యమం మరో మలుపు తిరిగినట్టు తిరిగింది. ఆందోళనలకు సంబంధించి ఇప్పటివరకూ 5 వేల మంది అరెస్టయినట్టు వెల్లడించింది. ఆందోళనల్లో 24 స్కూల్స్ తగలబడ్డాయని, జాతీయ విద్యాశాఖకు చెందిన 78 మంది ఉద్యోగులు గాయపడ్డారని విద్యాశాఖ మంత్రి ఎడోర్డ్ జెఫ్రే తెలిపారు. పరిస్థితులను చక్కదిద్ది, శాంతి-భద్రతలను పరిరక్షించడమే తమ ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు.















