
పాప్‌సింగర్ స్మిత ఆలపించిన మసక మసక చీకటిలో పాట పాపులర్ అయిన విషయం తెలిసిందే. దేవుడు చేసిన మనుషులు సినిమా నుంచి రీమిక్స్ చేసిన ఈ పాట 2000లో విడుదలైంది. తాజాగా ఈ పాటకు ర్యాప్ సంగీతాన్ని జోడించి యువతకు నచ్చేలా ఓజీ ఎక్స్ మసక మసక పేరుతో క్రియేట్ చేశారు. ఈ పాటలో నోయల్‌తో కలిసి స్టెప్పులేసింది స్మిత. విజయ్ బిన్నీ డైరెక్ట్ చేశారు. హైదరాబాద్‌లో ఈ పాటను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్మిత మాట్లాడుతూ ఇక నుంచి నా జీవితంలో సంగీతం మాత్రమే ఉండబోతున్నది. నార్త్‌లో ఇండిపెండెంట్ మ్యూజిక్ బాగా పాపులర్ అవుతున్నది. దక్షిణాదిన మాత్రం నేను ఆపినచోటే ఆగిపోయింది. అందుకే మళ్లీ మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నా. సంక్రాంతికి మరో పాటతో ముందుకురాబోతున్నా. మార్చి నుంచి లైవ్‌షోస్ కూడా ఉంటాయి. హైదరాబాద్, ఆంధ్రాతో పాటు యూఎస్, దుబాయ్, ఆస్ట్రేలియా, సింగపూర్‌లో ఈవెంట్స్ ఉంటాయి అని చెప్పింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు దేవా కట్టా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.















