గద్దర్ తెలంగాణ సినిమా అవార్డులను జూన్ 14న ప్రదానం చేయనున్నట్లు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. హైదరాబాద్ హైటైక్స్‌లో ఘనంగా నిర్వహించే వేడుకలో అవార్డులను అందజేస్తామన్నారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఈ ఏడాది నుంచి ఈ బృహత్తర కార్యక్రమానికి మళ్లీ శ్రీకారం చుట్టాం. ఇక నుంచి ప్రతి ఏడాదీ ఉత్తమ చలనచిత్రాలకు, వివిధ కేటగిరీలలో ప్రతిభ కనబరిచిన కళాకారులకు ప్రభుత్వ అవార్డులను అందిస్తాం. గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల పట్ల ప్రభుత్వానికి ఓ స్పష్టమైన విధానం ఉంది. ప్రతి ఒక్కరూ ఈ అవార్డుల గురించి మాట్లాడుకునేలా, భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా ఉండేలా, కనీవినీ ఎరుగని రీతిలో ఈ వేడుకను నిర్వహిస్తాం అని తెలిపారు.

గద్దర్ పేరిట ఇస్తున్న ఈ అవార్డులపై ఎన్ని విమర్శలు వచ్చినా, ఆయన పేరుతోనే అవార్డులు ఇస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి పేర్కొన్నారు. 2024లో సెన్సార్‌బోర్డ్ సర్టిఫికెట్ పొందిన చిత్రాలకు అవార్డులను అందించడానికి ఈ నెలలో దరఖాస్తులను కోరారు. దాంతో వివిధ విభాగాలకు గాను, దర్శక, నిర్మాతల నుంచి 76 దరఖాస్తులు, వ్యక్తిగత అవార్డుల విభాగాలకు గాను 1172 నామినేషన్లు రావడం జరిగింది. ఈ నామినేషన్లంటినీ పరిశీలించి అవార్డులు ఇవ్వడానికి సినీ నటి జయసుధ అధ్యక్షతన 15మందితో కూడిన ఓ జ్యూరీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ నెలరోజులూ ఈ సినిమాలన్నింటినీ తిలకించి, వాటిలో ఉత్తమ చిత్రాలను, అందులోని వివిధ కేటరిగీలలో ప్రతిభ కనబరచిన కళాకారులను జ్యూరీ అవార్డుల కోసం ఎంపిక చేయబోతున్నది. ఈ సమావేశంలో ఎఫ్‌డీసీ ఛైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్‌రాజు, గద్దర్ అవార్డుల జ్యూరీ ఛైర్మన్ నటి జయసుధ పాల్గొన్నారు.
