డల్లాస్ మహా నగరం దగ్గరలోని ఇర్వింగ్ సిటీలో గల రివర్ సైడ్ విలేజ్ కమ్యూనిటీలో వినాయక చవితిని కమ్యూనిటీ సభ్యులు అందరు కలిపి ఒక కుటుంబంలా చాలా సంప్రదాయముగా జరుపుకున్నారు. లేబర్ డే సెలవు రోజు కలిసిరావడం తో నిమజ్జనంతో కలిపి ఆరు రోజులు నిత్య పూజలతో, భక్తిశ్రద్ధలతో, మండపంలో రోజుకో అలంకరణ తో, పిల్లలు పెద్దల ఆటపాటలతో వేదిక కళకళలాడింది. ప్రతిరోజు సాంప్రదాయ కీర్తనలు, శ్లోకాలు, భజనలు, నృత్యం, పాటలు, మరియు చక్కనైన ఉపన్యాసాలతో కూడిన సాంస్కృతిక కార్యక్రమాలలో పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా పాలుపంచుకొని అతిదులని అలరించారు. ఇండియా నుండి వచ్చిన తల్లిదండ్రులు కూడా పిల్లలతో పోటీగా నృత్యం చేసి మనవళ్లకి మనవరాళ్లకి మరుపురాని జ్ఞాపకాలని పంచారు. ఎప్పటిలానే లడ్డు వేలం ఈ సంవత్సరం కూడా చాల హుషారుగా నడిచి, మొత్తం 13 లక్షలకు పైగా పాట పాడుకోవడం జరిగింది. పండుగ ఐదవ రోజు ఐన శనివారం నాడు పెట్టిన బంతి భోజనాలు ఈ ఉత్సవాలలో ప్రత్యేకంగా నిలిచాయి. తెలుగు సంప్రదాయమైన పంచె కట్టుతో, ఆప్యాయతలతో దగ్గర దగ్గర మూడు వందల యాబ్భై మంది అతిదులకి ఎన్నో రకాల పిండి వంటలతో రుచికరమైన భోజనాన్ని వడ్డించారు. చివరి రోజైన నిమజ్జనం రోజు వినాయకుడి ముందు పిల్లలు, పెద్దలు రంగులతో ఎంతో సంతోషంగా హోలీ, దాండియా ఆడి భారతదేశం లో ఉండే పండగ వాతావరణాన్ని డల్లాస్ కి తీసుకువచ్చారు. వేడుకుల ముగింపుగా గణపతిని పుర విధులలో ఘనంగా ఊరేగించి వీడ్కోలు పలికారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)