ఐఎంఎఫ్ (అంతర్జాతీయ ద్రవ్యనిధి) సంస్థ టాప్ 2 పదవికి భారత సంతతి ఆర్థికవేత్త గీతాగోపీనాథ్ ఎంపికయ్యారు. ప్రస్తుతం ఐఎంఎఫ్ చీఫ్ ఎకనామిస్ట్ గా ఉన్న గీతా గోపీనాథ్ వచ్చే నెలలో ఫస్ట్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఐఎంఎఫ్ జాఫ్రీ ఒకమోటో వచ్చే ఏడాది జనవరిలో పదవి నుంచి తప్పుకోనున్న నేపథ్యంలో ఆ పోస్టుకు గీతా గోపీనాథ్ ను ఎంపిక చేశారు. జాఫ్రీ, గీత అద్భుతమైన అధికారులని, జాఫ్రీ వెళ్లిపోవడం బాధిస్తోందని ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలీనా జార్జివా తెలిపారు. గీత ఇక్కడే ఉండి కొత్త పదవిని చేపట్టేందుకు అంగీకరించడం ఆనందంగా ఉందన్నారు. వాస్తవానికి వచ్చే ఏడాది జనవరిలో ఆమె హార్వర్డ్ యూనివర్సిటీలో అకడమిక్ పొజిషన్‌కు వెళ్లాల్సి ఉంది.
ఐఎంఎఫ్ డైరక్టర్ క్రిస్టలినా జార్జీవా సూచన మేరకు డిప్యూటీ ఎంపీ బాధ్యతల్ని స్వీకరించేందుకు గీతా అంగీకరించారు. ఐఎంఎఫ్ చరిత్రలో తొలిసారి మహిళా చీఫ్ ఎకానమిస్ట్‌గా గీతా గోపీనాథ్ బాధ్యతలు నిర్వర్తించారు. గోపీనాథ్ నాయకత్వంలో ఐఎంఎఫ్ రీసర్చ్ శాఖ బలోపేతం అయ్యింది.