పంజాబ్ పీసీసీ పీఠం సిద్దూకే దక్కింది. సీనియర్లతో పాటు సీఎం అమరీందర్ సింగ్ ఎంత వ్యతిరేకత వ్యక్తం చేసినా, అధిష్ఠానం మాత్రం సిద్దూ వైపే మొగ్గు చూపింది. సిద్దూను పీసీసీ అధ్యక్షుడిగా ప్రకటిస్తూ పార్టీ సంస్థాగత వ్యవహారాల కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆదేశాలు జారీ చేశారు. సీఎం అమరీందర్ సింగ్ మాత్రం పైకి అధిష్ఠానం మాటే ఫైనల్ అని చెబుతున్నా, పీసీసీ పగ్గాలు సిద్దూ చేతిలోకి వెళ్లడం ఏమాత్రం నచ్చడం లేదు. ఎమ్మెల్యేలందర్నీ సీఎం అమరీందర్ సోమవారం లంచ్‌కు పిలిచారు. సిద్దూను మాత్రం పిలవలేదు. మరోవైపు తనను పీసీసీ అధ్యక్షుడిగా ప్రకటించడంపై సిద్దూ స్పందించారు. పంజాబ్ అధ్యక్షుడిగా తన యాత్ర ఇప్పుడే ప్రారంభమైందని, ఎన్నికల్లో పార్టీని ముందుకు తీసుకెళ్తానని ప్రకటించారు. ‘పంజాబ్ ను గెలిపిస్తాం’ అన్న నినాదాన్ని సార్థకం చేస్తానని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కర్నీ కలుపుకొని వెళ్తానని సిద్దూ ప్రకటించారు.