అక్కినేని నాగార్జున, నాగచైతన్యతో కలిసి హీరోలుగా నటిస్తున్న చిత్రం బంగార్రాజు. ఈ చిత్రం సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్టు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించారు. ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకురానున్నది. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ సినిమా ప్రారంభించినప్పుడే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకున్నాం. ఒమిక్రాన్ ప్రభావం తగ్గుముఖం పట్టి అన్ని సవ్యంగా ఉంటే అనుకున్నట్లుగా ఈ నెల 14న విడుదల చేస్తాం అన్నారు. ఈ సినిమాలో అఖిల్ నటించలేదు. ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ వాయిదా పడటం బాధను కలిగిస్తుంది. చాలా ఏళ్లుగా ఎన్నో కష్టాలు పడి సినిమాలను తెరకెక్కించారు. ఆ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కాలంటే ప్రపంచం మొత్తం అ సినిమాలు విడుదలకావాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యం కాదన్నారు.
సినిమా వేడుకల్లో రాజకీయ అంశాల గురించి మాట్లాడను. ఏపీలోని టికెట్ల రేట్ల సమస్య వల్ల మా సినిమాకు ఎలాంటి ఇబ్బందులుండవనుకుంటున్నా. టికెట్ల ధరలు ఎక్కువగా ఉంటే వసూళ్లు పెరిగేవి. కరోనా వల్ల ఇతర రాష్ట్రాల్లో థియేటర్లపై ఆంక్షలు విధించారు. వాటి కారణంగా మా సినిమా వసూళ్లు తక్కువగానే ఉంటాయనుకుంటున్నా. సినిమా పూర్తిచేసి వేచిచూడటం కంటే విడుదల చేయడమే ఉత్తమమని నిర్ణయంచుకున్నాం అని తెలిపారు. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ బంగార్రాజుకి నాగార్జున నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సోగ్గాడు మళ్లీ వచ్చాడు అనే ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి కల్యాణ్ కృష్ణ దర్శకుడు. సత్యనంద్ స్క్రీన్‌ప్లేను అందించగా, అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చారు. రమ్యకృష్ణ, కృతిశెట్టి హీరోయిన్లుగా నటించారు.