చట్టబద్ధంగా అమెరికాకు వలస వచ్చినవారి పిల్లల (డాక్యుమెంటెడ్ డ్రీమర్స్)కు పౌరసత్వం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు అమెరికా ప్రకటించింది. దీనికోసం చట్టపరిధిలో అందుబాటులో ఉన్న మార్గలను పరిశీలిస్తున్నట్టు అమెరికా పేర్కొంది. అమెరికాకు వలస వెళ్లి అక్కడే స్థిరపడిన విదేశీయుల పిల్లలు 21 ఏళ్లు వచ్చిన తర్వాత డిపెండెంట్ హోదా కోల్పోతారు. పేరెంట్స్‌కు గ్రీన్‌కార్డు లేనిపక్షంలో వారి పిల్లలు తిరిగి స్వదేశాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఇలా 21 ఏళ్లు నిండే యువకులు అమెరికాలో 2 లక్షల మంది వరకు ఉన్నట్టు అంచనా. భారతీయులు కూడా గణనీయంగా ఉన్నారు. వీరంతా ఇంఫ్రూప్ ద డ్రీమ్ పేరుతో గ్రూప్‌గా ఏర్పడి పౌరసత్వం కోసం అమెరికాపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈ అంశంపై అమెరికా ప్రెస్ సెక్రటరీ మాట్లాడుతూ అధ్యక్షుడు జో బైడెన్ కూడా వలస చట్టాల్లో మార్పుల అవసరాన్ని గుర్తించినట్టు తెలిపారు. దీనికి సంబంధించిన బిల్లు కాంగ్రెస్ పరిశీలనలో ఉందని వెల్లడిరచారు.