భారత్ విద్యార్థులకు యూకే ప్రభుత్వం శుభవార్త చెప్పింది. బ్రిటన్‌లో గ్రాడ్యుయేట్ రూట్ వీసాల జారీ సంఖ్యను తగ్గించాలన్న ప్రభుత్వ ప్రణాళికను విరమించుకోవాలని ప్రధాని రిషి సునాక్ నిర్ణయించారు. ఈ వీసాలు తగ్గితే భారత విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతాయి. దీన్ని సునాక్ సొంత మంత్రివర్గ సభ్యులే వ్యతిరేకించారు. ప్రస్తుతం బ్రిటన్‌లో ఉన్న విదేశీ విద్యార్థుల్లో 40 శాతం భారతీయులే. అంతర్జాతీయ విద్యార్థులకు గ్యాడ్యుయేట్ రూట్ వీసాల జారీని తగ్గిస్తే దేశంలోని యూనివర్సిటీలు, దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుందని విదేశాంగ కార్యదర్శి డేవిడ్ కేమరన్ సహా పలువురు మంత్రులు సునాక్ నిర్ణయానికి అభ్యంతరం వ్యక్తం చేశారు.
గ్రాడ్యుయేట్ వీసా ఉన్న విద్యార్థులకు తమ చదువు పూర్తయ్యాక రెండేండ్లు యూకేలో ఉద్యోగం చేయడానికి అనుమతి ఇస్తారు. అయితే దాన్ని ప్రతిభావంతులకు మాత్రమే ఇవ్వాలని సునాక్ తొలుత ఆలోచించారు. మంత్రివర్గం నుంచి వ్యతిరేకత రావడంతో ఆ ఆలోచనను విరమించుకున్నారు.