అమెరికాలోని భారతీయులకు శుభవార్త. హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు, 21 ఏండ్లలోపు వయసు న్న పిల్లలు అమెరికాలో ఉద్యోగాలు చేసుకునేందుకు వీలు కల్పించే కీలక బిల్లును బైడెన్ సర్కారు త్వరలో ఆమోదించనున్నది. దీంతో దాదాపు లక్ష మంది హెచ్-4 వీసాదారులకు (హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు, పిల్లలకు) ఆటోమేటిక్ వర్క్ ఆథరైజేషన్ లభిస్తుంది.
ఇందుకు సంబంధించిన జాతీయ భద్రతా ఒప్పందాన్ని అమెరికా పార్లమెంట్‌లో ఆమోదించాలని అధికార డెమోక్రటిక్, ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీల నాయకులు అంగీకారానికి వచ్చారు. అమెరికా సెనేట్‌లో ఇరు పక్షాల మధ్య సుదీర్ఘ చర్చల అనంతరం ఈ అంగీకారం కుదిరింది. దీంతో 21 ఏండ్ల కంటే అధిక వయసున్న దాదాపు 2.5 లక్షల మంది హెచ్-1బీ వీసాదారుల పిల్లలకు కూడా పరిష్కారం లభిస్తుంది. అమెరికాలో గ్రీన్‌కార్డుల కోసం చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న వేల మంది భారత వృత్తి నిపుణులకు ఇది ఎంతో ప్రయోజన కరమైన బిల్లు. ఈ బిల్లు అమలైతే వచ్చే ఐదేండ్లపాటు ఏటా 1,58,000 మందికి గ్రీన్‌కార్డులు మంజూరు చేస్తారు.