హెచ్-1బీ వీసా దరఖాస్తు కోసం వేచి చూస్తున్న భారతీయ ఐటీ ప్రొఫెషనల్స్కు శుభవార్త. మార్చి 1 నుంచి ఈ వీసాల దరఖాస్తులను స్వీకరించనున్నట్టు యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) ప్రకటించింది. ప్రతి సంవత్సరం భారత్, చైనా వంటి దేశాల నుంచి వేలాది మంది ఉద్యోగులను నియమించుకోవడానికి అమెరికా టెక్నాలజీ కంపెనీలు హెచ్-1బీ వీసాలపై ఆధారపడుతుంటాయి. ఈ నేపథ్యంలో 2023 అక్టోబరు 1 నుంచి ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరానికి గాను మార్చి 1 నుంచి 17 వరకు హెచ్-1బీ వీసాల దరఖాస్తులను స్వీకరించనున్నట్టు యూఎస్సీఐఎస్ తెలిపింది. ఈ వీసాల ద్వారా టెక్నాలజీ, ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి ప్రత్యేక రంగాల్లో ఆరేళ్ల వరకు అమెరికాలో పని చేయడానికి, నివసించడానికి అనుమతి లభిస్తుంది. మార్చి 17 నాటికి సరిపోయేంతగా రిజిస్ర్టేషన్లను స్వీకరిస్తే వాటిని రాండమ్గా ఎంపిక చేస్తామని యూఎస్సీఐఎస్ పేర్కొంది.
ఐటీ, ఫైనాన్స్, ఇంజినీరింగ్ తదితర విభాగాల్లో విదేశీ స్క్రిల్డ్ ప్రొఫెషనల్స్ నియామకం కోసం అమెరికా నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాగా హెచ్-1బీ వీసా జారీ చేస్తుంది. 2021 ఆర్థిక సంవత్సరంలో 74 శాతానికి పైగా భారతీయ నిపుణులు హెచ్-1బీ వీసాలు అందుకున్నారు. యూఎస్సీఐఎస్ ఆమోదించిన 4.07 లక్షల హెచ్-1బీ వీసాల్లో 3.01 లక్షలు భారతీయులకు కేటాయించారు. 50 వేల వీసాలు చైనీయులకు లభించాయి.