ఎన్నారైలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఒక్కో రాష్ట్రం ఒక్కోతరహాలో అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్లు జారీ చేస్తుండటం వల్ల భారతీయులకు విదేశాల్లో ఇబ్బందులు ఎదురవుతుండటాన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం వీటిని ప్రామాణీకరించింది. ఇకపై అన్ని రాష్ట్రాలూ ఒకే తరహాలో ఈ పర్మిట్లు జారీ చేసేలా నిబంధనలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ రోడ్ ట్రాఫిక్ 1949 (జెనీవా కన్వెన్షన్) పై సంతకం చేసిన దేశాల్లో భారత్ కూడా ఉన్నందున దాని ప్రకారం ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్లు జారీ చేసే అధికారం మనకు దక్కింది. ఈ కన్వెన్షన్‌పై సంతకాలు చేసిన దేశాలు జారీ చేసిన పర్మిట్లను పరస్పరం అనుమతిచ్చేందుకు అప్పట్లో ఒప్పందం కుదిరింది.
అయితే దేశంలోని వివిధ రాష్ట్రాలు జారీచేసే పర్మిట్ ఫార్మాట్, సైజ్, ప్యాట్రన్, కలర్ వేర్వేరుగా ఉంటున్నందున విదేశాల్లో వాటిని చూసినప్పుడు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పుడు నిబంధనలను సవరించి దేశవ్యాప్తంగా ఒకే పద్ధతిలో ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట జారీ చేయాలని నిర్ణయించారు. ప్రతి ఐడీపీకి ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ కూడా లింక్ చేయాలని, హెల్ప్‌లైన్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ కూడా అందులో పొందుపరచాలని నిర్ణయించారు.
భారతీయ పాస్‌పోర్టు కలిగిన ఇక్కడే నివసిస్తున్న వారు ఈ పర్మిట్ పొందేందుకు అర్హలు. ఇందుకోసం దరఖాస్తుదారులు తమ డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటూ పాస్‌పోర్టు తాలూకు కాపీలు తదితర డ్యాకుమెంట్లతో ఫామ్ 2 దరఖాస్తు ద్వారా పర్మిట్ కోసం ఆప్లై చేసుకోవాలి. కొన్ని సందర్భాల్లో వీసా వివరాలు కూడా సమర్పించాల్సి ఉంటుంది. ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఏ ప్రాంతంలో నివసిస్తే అదే ప్రాంతానికి చెందిన ఆర్‌టీఏ కార్యాలయంలో దరఖాస్తు చేయాలి.