ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆదిపురుష్ ముహూర్తం పెట్టారా? అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. ఓంరౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రమిది. రామాయణం ఆధారంగా రూపొందిన ఈ సినిమా ప్రచారాన్ని మొదలు పెట్టడానికి దసరా ఉత్సవాల్ని మించిన మంచి సమయం మరొకటి దొరకదని భావించిన చిత్ర బృందం ఈ మేరకు ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసే ప్రణాళికలు రచించినట్టు తెలుస్తోంది. బాలీవుడ్ వర్గాల సమాచారం మేరకు అక్టోబరు 3న లుక్ విడుదల కావొచ్చని తెలుస్తోంది. ఇందులో ప్రభాస్, రాఘవగా, కృతిసనన్ జానకిగా, సైఫ్ అలీ ఖాన్ లంకేశ్‌గా, సన్నీసింగ్ లక్ష్మణగా నటించారు. సుమారు రూ.500 కోట్ల వ్యయంతో ఈ సినిమా రూపొందుతున్నట్టు సమాచారం.
అత్యాధునిక సాంకేతికతతో భారీ వ్యయంతో రూపొందిన ఈ సినమా కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. తెలుగు, హిందీతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కానుంది. ఇక ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు థియేట్రికల్ హక్కులను యూవీ క్రియేషన్స్ భారీ ధరకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.