ప్రాంతీయ శాంతి, భద్రత, అనుసంధానంలో భారత్, ఇథియోపియా సహజ భాగస్వాములని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఇథియోపియాలో ఉంటే సొంతింట్లో ఉన్నట్లుందని తెలిపారు. ఈ మేరకు ఆ దేశ పార్లమెంటులో మోడీ ప్రసంగించారు. ప్రాచీన జ్ఞానం, ఆధునిక ఆశయాలు కలిగిన ఈ దేశ ప్రజాస్వామ్య మందిరంలో ఉండటం గర్వకారణమని అన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలైన భారత్, ఇథియోపియా ఒకదానికొకటి పరస్పరం సహకరించుకోవాలన్నారు. ఇరుదేశాల మధ్య వాణిజ్య సంబంధాలపై చర్చలు కొనసాగుతున్నట్టు తెలిపారు.
ఇథియోపియా, గుజరాత్ రెండు కూడా సింహాలకు ప్రసిద్ధి. ఈ దేశంతో భారత్‌కు సత్సంబంధాలు ఉన్నాయి. ప్రపంచమంతా వసుదైౖక కుటుంబమైంది. భారతీయ టీచర్లు చాలా మంది ఇథియోపియాలో సేవలు అందిస్తున్నారు. ఇక్కడ అత్యధిక విదేశీ పెట్టుబడిదారులుగా భారతీయులే ఉన్నారు. వీరు వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టి ఉపాధి కల్పిస్తున్నారు అని మోడీ తెలిపారు.

భారతదేశంలోని 1.4 బిలియన్ల ప్రజల తరపున ఆ దేశానికి స్నేహపూర్వక సోదరభావ శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఈ పర్యటనలో ప్రధాని మోదీకి అపూర్వ గౌరవం లభించింది. ఇథియోపియా ప్రభుత్వం ఆయనకు దేశ అత్యున్నత పురస్కారం గ్రేట్ ఆనర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా’తో సత్కరించింది. అదిస్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఇథియోపియా ప్రధాని డాక్టర్ అబి అహ్మద్ అలీ ఆయనను అవార్డుతో సత్కరించారు.















