Namaste NRI

డాలస్‌లో గోరటి వెంకన్న మాట-పాట కార్యక్రమం

తానా ప్రపంచ సాహిత్యవేదిక ఆధ్వర్యంలో ఆటా, డాటా, డి టాబ్స్, జిటిఎ, నాట్స్, టాన్ టెక్స్, టిపాడ్ సంస్థల సహకారంతో డాలస్ లో నిర్వహించిన  తెలుగు సాహిత్యంలో కవితా వైభవం.. డా. గోరటి వెంకన్న మాట – పాట కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. తానా పూర్వాధ్యక్షులు, తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర ముఖ్య అతిథి హాజరై  డా. గోరటి వెంకన్నను సభకు పరిచయం చేశారు. రెండున్నర గంటలకు పైగా సాగిన కార్యక్రమంలో డా. గోరటి వెంకన్న ముందుగా పల్లె కన్నీరు పెడుతుందో అనే పాటను చాలా హృద్యంగా గానం చేశారు.

ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ 1995లో కుబుసం సినిమాలో వచ్చిన పల్లె కన్నీరు పెడుతుందో  అత్యంత ప్రజాదరణ పొందిన పాట. మూతబడ్డ చేతివృత్తులు, పాటుబడ్డ పల్లెలు, ఆధునిక జీవన విధానం, విదేశీ కంపెనీల స్వైర విహారంతో కుదేలవుతున్న గ్రామసీమల నేపధ్యంలో గోరటి వ్రాసిన ఈ పాట ఆయనకు ఎనలేని పేరు ప్రతిష్ఠలు తెచ్చిపెట్టిందని, ఈ పాట ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం ప్రచురణలలో స్థానం పొందిందని అంతేగాక ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బి.ఏ విద్యార్ధులకు పాఠ్యాంశంగా కూడా చేర్చబడిందని అన్నారు.

గోరటి జీవితంలో ఉద్యమాలు సృష్టించిన పాటలు కొన్నైతే, గోరటి పాటలే సృష్టంచిన ఉద్యమాలు మరిన్ని అన్నారు. రేలపూతలు, పూసిన పున్నమి, అలసెంద్ర వంక, వల్లంకి తాళం సంకలనాల్లో మొత్తం 120 కవితలుంటే వాటిలో దాదాపు 30 వరకు నీరు, నీటి వనరుల ప్రాముఖ్యత మీద వ్రాసినవే కనిపిస్తాయి. దీనినిబట్టే పాటలల్లో వెంకన్న నీటికి ఎంత పెద్దపీట వేశారో తెలుస్తుంది అన్నారు.

అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) ఉత్తరాధ్యక్షులు సతీష్ రెడ్డి, డాలస్ ఏరియా తెలంగాణా సంఘం (డాటా) తరపున రఘువీర్ మర్రిపెద్ది, డాలస్ తెలుగు అలయ్ బలయ్ సంఘం (డి-టాబ్స్) అధ్యక్షులు రాజ్ ఆనందేషి, గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (జిటిఎ) జాతీయ ఉపాధ్యక్షులు ప్రవీణ్ బిల్లా, ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) పూర్వాధ్యక్షులు బాపు నూతి, తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సస్ (టాన్టెక్స్) అధ్యక్షులు చంద్ర పొట్టిపాటి మరియు తెలంగాణా పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాలస్ (టిపాడ్) సంస్థ వ్యవస్థాపక సభ్యులు, ఫౌండర్స్ కమిటీ ఛైర్మన్ రావు కల్వాల మొదలైన వారు వారి వారి సంఘసభ్యులతో కలసి డా. గోరటిని పుష్పగుచ్చాలతో సన్మానించారు.  

అలాగే మన తెలుగు రాష్ట్రాలనుండి డాలస్ పర్యటనలో ఉన్న ప్రముఖ రచయిత్రి అత్తలూరి విజయలక్ష్మి, ప్రముఖ రంగస్థల నటులు, ప్రయోక్త, రచయిత ఆచార్య డా. కందిమళ్ళ సాంబశివరావు, తేజస్వి సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సుధాకర్, పార్వతీపురం నాయుడు గార్లు డా. గోరటిని ప్రత్యేకంగా సన్మానించారు.ఈ కార్యక్రమ సంచాలకులు, తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర గోరటి వెంకన్న సతీమణి అనసూయ, కుమార్తె తేజస్విని, అల్లుడు రే లను వేదికపైకి ఆహ్వానించి అందరి తరపున డా. గోరటి వెంకన్నకు మనకాలపు మహాకవి అనే బిరుదును ప్రదానంచేసి సన్మానపత్రం, కిరీటం, దుశ్శాలువాతో, పుష్పగుచ్చాలతో అందరి హర్షాతిరేకాలమధ్య ఘనంగా సన్మానించారు.

డా. గోరటి వెంకన్న మాట్లాడుతూ  ప్రసాద్ తోటకూర సభా నిర్వహణ ఆద్యంతం అందరినీ ఆకట్టుకుందని అన్నారు. నేను చిందులెయ్యకుండా నిలబెట్టి రెండున్నర గంటలపాటు పాటలను, దానిలో ఉన్న సాహిత్యాన్ని రాబట్టిన ఘనత ప్రసాద్ గారిదేనని, ఇలాంటి కార్యక్రమం చెయ్యడం ఇదే తొలిసారి అని, ఎంతో ప్రేమతో అన్ని సంఘాలను ఒకే వేదికమీదకు తీసుకువచ్చి అందరితో సన్మానం చేయించి మనకాలపు మహాకవి అనే బిరుదును ప్రదానం చేసిన చిరకాల మాన్యమిత్రులు డా. ప్రసాద్ తోటకూర గారికి, వివిధ సంఘాల ప్రతినిధులకు, అధిక సంఖ్యలో తరలివచ్చి ఆసాంతం శ్రద్ధగా విన్న సాహిత్యాభిలాషులకు వందనాలర్పిస్తూ, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్న రోజు కన్నా, ఈ రోజు నా జీవితంలో ఒక మరపురాని మధురమైన రోజు అంటూ అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమం మొత్తాన్ని వీడియో రూపంలోనూ, ఫోటోల రూపంలోనూ చిత్రీకరించిన శ్రీకుమార్, శిరీష గోమటం దంపతులను డా. గోరటి వెంకన్న సన్మానిం, కృతజ్ఞతలు తెలియజేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events