ఆంధ్ర కళా వేదిక- ఖతార్ ఆధ్వర్యంలో గురుపూజోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఐసీసీ ముంబై హాల్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆంధ్ర కళా వేదిక అధ్యక్షుడు వెంకప్ప భాగవతుల మాట్లాడుతూ విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దేందుకు తమ జీవితాలను అంకితం చేసిన ఉపాధ్యాయులను గుర్తు చేసుకుంటూ నిర్వహించిన ఈ వేడుక ఎంతో గొప్పదని అన్నారు. డా. సర్వేపల్లి రాధాకృష్షన్ ఒక ఆదర్శప్రాయమైన ఉపాధ్యాయుడే కాకుండా, విద్య, తత్వశాస్త్ర వికాసానికి గణనీయమైన కృషి చేశారన్నారు. అంతేకాకుండా ఖతార్‌లో తొలిసారిగా నిర్వహించిన గురుపూజోత్సవ వేడుక ఆంధ్ర కళా వేదిక ద్వారా ప్రారంభమైనందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. ఖతార్‌లోని భారతీయ పాఠశాలల్లో పనిచేస్తున్న సుమారు 55 మంది తెలుగు ఉపాధ్యాయులను అభినందిస్తూ వారిని పుష్ప గుచ్ఛాలు, జ్ఞాపికలతో సత్కరించారు.

ఈ సందర్భంగా కొందరు ఉపాధ్యాయులు గురుపూజోత్సవం పై తమకున్న అభిప్రాయాలను, అనుభవాలను పంచుకున్నారు. ఇంతటి బాధ్యతాయుతమైన కార్యక్రమాన్ని అద్భుతంగా, వైవిధ్యంగా నిర్వహించినందుకు ఆంధ్ర కళా వేదిక కార్యవర్గాన్ని ప్రశంసించారు. ఈ వేడుకలను సమర్థంగా నిర్వహించిన కార్యవర్గ సభ్యులు విక్రమ్ సుఖవాసి, సుధ, శిరీషా రామ్, వీబీకే మూర్తి, రవీంద్ర, సోమరాజు, సాయి రమేష్, శేఖరం రావు తదితరులను అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని ముగించారు. ఈ కార్యక్రమానికి ఖతార్‌లోని భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో ఉన్న ఇండియన్ కల్చరల్ సెంటర్ అధ్యక్షులు ఏపీ మణికంఠన్, ఉపాధ్యక్షులు సుబ్రహ్మణ్య హెబ్బాగులు, జనరల్ సెక్రటరీ మోహన్, హెడ్ ఆఫ్ ఇన్ హౌస్ యాక్టివిటీస్ సత్యనారాయణ మలిరెడ్డితో పాటు తెలుగు ప్రముఖులు కేఎస్ ప్రసాద్, ఇంద్రగంటి ప్రసాద్ తదితరులు హాజరయ్యారు.