తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఈ నెల 24న నిర్వహించే ముక్కోటి వృక్షార్చనను విజయవంతం చేయాలని టీఆర్‌ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ నెల 24న ఒకే రోజు ఒకే గంటలో మూడు కోట్ల మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రజలంతా పాల్గొనాలని కోరారు. రాజకీయ నేతల జన్మదినం రోజున రోడ్ల నిండా కటౌట్లు, పోస్టర్లు నింపి జనాన్ని ఇబ్బంది పెట్టకుండా జనహితం కోసం, ముందు తరాల కోసం హరిత తెలంగాణ కోసం ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ముక్కోటి వృక్షార్చన చేపట్టారని చెప్పారు. ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమాన్ని ఎప్పటికీ కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు.