దక్షిణాఫ్రికాలో గిడుగు వెంకటరామమూర్తి జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా, ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ అఫ్ సౌత్ ఆఫ్రికా, సౌత్ ఆఫ్రికా తెలుగు కమ్యూనిటీ సంయుక్తంగా నిర్వహించిన ఉత్సవాలకు తెలుగు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు తెలుగు భాష ఔన్నత్యం, అవసరం తెలిసేలా వ్యాస రచన, పద్యాలు, వక్తృత్వ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. దక్షిణాఫ్రికాలో తెలుగు భాషాసాహిత్యాల అభివృద్ధికి,వ్యాప్తికి విశేష కృషి చేస్తున్న రాపోలు సీతారామరాజును సన్మానించారు.

సీతారామరాజు మాట్లాడుతూ తెలుగు భాషావ్యాప్తికి తన వంతు ప్రయత్నం శాయశక్తులా కృషి చేస్తానని అన్నారు. తల్లిదండ్రులు మాతృభాష తెలుగును పిల్లలకు నేర్పించాలని సూచించారు. ఈ సందర్భంగా అన్ని సంఘాల ప్రతినిధులు తెలుగు భాష గొప్పదనాన్ని గుర్తుచేసుకున్నారు. రాబోయే రోజుల్లో భాషాపరమైన కార్యక్రమాలు విరివిగా చేపట్టాలని సమావేశంలో తీర్మానించారు.

ఈ కార్యక్రమంలో శ్రీరాముల గుమ్మడి, బండారు మురళి, నాని నిర్మల్, జయప్రకాశ్ కుప్పు రాజు, యెలిగేటి వేణుమాధవ్ , తాళ్ళూరి శ్రీనివాస్, గరిశె కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.